డియస్సీ నోటిఫికేషన్ గురించిన సందేహాలను నివృతి చేసే ప్రయత్నం: డియస్సీ నోటిఫికేషన్ దోబూచులాడుతోంది. వారం తరువాత అంటూ, పది రోజుల తరువాత అంటూ వాయిదాల పర్వం కొనసాగుతున్నది. కానీ మిత్రమా, డియస్సీ విషయంలో ఇదేమీ కొత్తేమీ కాదు. నేను 2008 డియస్సీ నుంచి గమనిస్తున్నాను. ఇది ప్రతిసారి కొనసాగేతంతే. కనుక ఈ విషయాలను గురించి ఏమీ ఆలోచించకండి. ప్రిపరేషన్ మాత్రం చక్కని అంకిత భావంతో, ఉద్యోగమే లక్ష్యంగా కొనసాగించండి. మీ ప్రశ్నలకు నా విశ్లేషణ
*డియస్సీ నోటిఫికేషన్ ఉంటుందా?* ఖచ్చితంగా. ప్రస్తుత 2019 సంవత్సరం ఎన్నికల సంవత్సరం. సహజంగా ఎన్నికల వేళ ప్రతి ప్రభుత్వాలు అప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ విడుదల చేసి, పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి పూనుకోవడం సహజంగా జరుగుతున్నదే. డియస్సీ ఉంటుందంటూ ఇప్పటికే ప్రకటించేసిన కారణంగా తప్పకుండా డియస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతారు. *బిఈడి వారికి యస్జీటీకు అర్హత ఉంటుందా?* ఈ విషయమై తేల్చి చెప్పడం పద్ధతి కాదు. ఎందుకంటే ఉండదంటే, ఒకవేళ ఇస్తే బిఈడి అభ్యర్ధులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక నా ఈ విశ్లేషణను పరిగణనలోకి తీసుకుని మాత్రం మీ ప్రిపరేషన్ మార్చుకోకండి.
ఇక నా అంచనా ప్రకారం బిఈడి వారికి యస్జీటి అవకాశం ఇవ్వడం కొంచెం కష్టమే. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బిఈడి వారిని స్కూల్ అసిస్టెంట్లకు, డీఈడీ వారిని యస్జీటి పోస్టులకు పరిమితం చేయడం జరిగింది. ప్రస్తుత ఈ NCTE ప్రకటనను అమలు చేయడం ప్రారంభిస్తే సుప్రీంకోర్టును ధిక్కరించినట్లు అవుతుంది. అలాగే ఎవరో పెద్దల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే, ‘‘NCTE నిబంధనలను తప్పక అమలు చేయాలన్న నిబంధన ఏమీ ఉండదు. ఆయా రాష్ట్రాల వెసులుబాటును బట్టి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక ఉపాధ్యాయ విద్యా విధానాలు ఉన్నందున నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంటుంది’’ అంటూ తెలిపారు. నాకూ ఇది వాస్తవానికి దగ్గరగా అనిపించింది. ఒకవేళ అదే నిజమైతే NCTE నిబంధనలు ప్రక్కనబెట్టి యధాతధంగానే డియస్సీ విషయమై ప్రభుత్వం ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
ఒక వేళ బిఈడి అభ్యర్ధులను సంతృప్తి పరచాలని ప్రభుత్వం భావిస్తే బిఈడి వారికి కూడా అవకాశం ఇచ్చేందుకు న్యాయ సలహాను కోరి దానికి అనుగుణంగా ముందుకు సాగే అవకాశం కూడా లేకపోలేదు. కనుక నా సలహాను జస్ట్ సలహాగా భావించి వదిలివేస్తారని ఆశిస్తున్నాను.
మరోసారి టెట్ నోటిఫికేషన్ వస్తుందంటున్నారు నిజమేనా?
ఈ విషయమై కొంచెం సందేహాస్పదంగానే వార్తలు వినిపిస్తున్నాయి. బిఈడి వారికి సెకండరీ గ్రేడ్ పోస్టులకు అనుమతినిస్తే టెట్ నిర్వహించడం అనివార్యం అవుతుంది. అలా కాకుండా అవకాశం ఇవ్వకుండా డియస్సీని నిర్వహిస్తే టెట్ అవసరం ఉండదు. ఇక్కడ గమనించదగ్గ మరొక విషయం ఏమంటే, టెట్ ప్రతియేటా రెండు సార్లు నిర్వహిస్తారంటూ టెట్ ను ప్రకటించినపుడు నియమ నిబంధనలలో స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ మళ్లీ టెట్ నిర్వహించాల్సి వస్తే అది ఒకే సంవత్సరంలో మూడవ టెట్ అవుతుంది. కనుక మరొక కొత్త సమస్యగా మారే అవకాశం కూడా ఉన్నది.
అయితే ఇక్కడ అభ్యర్ధులు గమనించాల్సిందేమంటే టెట్ నిర్వహించినా, డియస్సీ నిర్వహించినా దాదాపు సబ్జక్టులు ఒక్కటే ఉన్నాయి కనుక ప్రస్తుతం టెట్ కు కాకుండా డియస్సీకు ప్రిపరేషన్ కొనసాగించడం ఉత్తమం. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇస్తే అదనంగా చదవాల్సింది కేవలం జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ మాత్రమే. యస్జీటి వారు అవి కూడా చదువుకుంటూనే ఉంటారు కనుక వారికి మరీ సులభం. కనుక నోటిఫికేషన్ వస్తే టెట్ పై దృష్టి సారించవచ్చు. నా అంచనా ప్రకారం టెట్ కంటే నేరుగా డియస్సీ రావడానికే ఎక్కువ అవకాశాలు కలవు.
డియస్సీలో పోస్టులు లేవంటూ జిల్లా పత్రికలలో ప్రచురిస్తున్నాారు నిజమేనా?
రేషనలైజేషన్ వల్ల పోస్టుల సంఖ్య తగ్గిపోవడం అనేది నిజమే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రస్తుత కాలంలో బయోమెట్రిక్, ఆన్ లైన్ విధానాల వల్ల పారదర్శకత పెరిగింది. అందువల విద్యార్ధుల సంఖ్యపై స్పష్టత రావడం, ఆ సంఖ్యను బట్టి రేషనలైజేషన్ జరగడం, రేషనలైజేషన్ చేస్తున్న ప్రతిసారి పోస్టులు తగ్గిపోతాయంటూ వార్తలు రావడం పరిపాటిగా మారిపోయింది. అయితే ప్రస్తుత ఈ సంవత్సరం ఎన్నికలు ముందున్న కారణంగా ప్రభుత్వాలు పోస్టులను రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చు. అదీకాక, పోస్టులను సృష్టించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయ సంఘాలు, రద్దును అంత త్వరగా అంగీకరించవు. మరీ ముఖ్యమైన వాస్తవమేమంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగి, విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కనుక పోస్టుల సృష్టించే రోజులను త్వరలోనే ఆశించవచ్చు. మొత్తంగా ప్రస్తుతం నా అంచనా ప్రకారం పోస్టులను రద్దు చేయడం దాదాపు సాధ్యం కాదు. కనుక ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఆశించిన స్థాయిలో కాకపోయినా, చక్కని సంఖ్యలోనే పోస్టులు ఉంటాయి.
బిఈడి చేశాను, డిఈడి చేశాను దేనికి ప్రిపేర్ కావడం ఉత్తమం?
ఇది పూర్తిగా మీకు మీరుగా తీసుకోవాల్సిన నిర్ణయం. బిఈడి లో మీ సబ్జక్టుకాక, ఇతర సబ్జక్టులపై మీకు ఏమాత్రం పట్టు ఉన్నదో చూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైనా స్కూల్ అసిస్టెంట్ లతో పోల్చితే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కు పోస్టుల సంఖ్య ఎక్కువగా కనిపించడం, పోటీ తక్కువ ఉన్నట్లు కనిపించడం సహజం . అయితే ఈ పోటీ దృష్ట్యా కాకుండా ఆయా సబ్జక్టులపై మీకున్న పట్టు, దేనిలో అయితే సులభంగా రాణించగలమని మీరు నమ్ముతారో దానిని ఎంచుకోండం మంచిది.
ఒకటి మాత్రం నిజం. రెండు పడవలపై కాళ్లు వేయడం ఎప్పటికీ ప్రమాదకరమే. కనుక ఖచ్చితంగా ఒకటి ఎంచుకుని దానికోసం శ్రమించే వారు మాత్రమే విజయం సాధిస్తారు. మరీ నిర్ణయం తీసుకోలేనంత సమస్యగా మీకు అనిపిస్తే నోటిఫికేషన్ వచ్చే వరకూ రెండింటికి ప్రిపేర్ అయ్యినా, నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఏదో ఒకటి ఎంచుకుని ముందుకు సాగడం మంచి పద్ధతి.
నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు?
కొన్ని విషయాలలో ప్రభుత్వానికి స్పష్టత రావలసి ఉంది. ముఖ్యంగా బిఈడి వారికి సెకండరీ గ్రేడ్ పోస్టులకు అర్హత ఇచ్చే విషయంలో, పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతి నిచ్చే విషయంలో. ఈ రెండు అంశాలపై స్పష్టత వచ్చిన మరుక్షణమే డియస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నా అంచనా ప్రకారం బహుశా వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
డియస్సీ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు?
నోటిఫికేషన్ వచ్చే సమయాన్ని బట్టి ఇది నిర్ధారణ అవుతుంది. ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఒకవేళ ఆగస్ట్, సెప్టెంబర్ లలో డియస్సీ నోటిఫికేషన్ వచ్చి, టెట్ నిర్వహించాల్సిన అవసరం లేనట్లయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో డియస్సీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అదే, టెట్ నిర్వహించాల్సి వస్తే అక్టోబర్ లో టెట్, జనవరి, ఫిభ్రవరి నెలల్లో డియస్సీ నిర్వహించే అవకాశం ఉంది.
ఎన్నికల నిబంధనలు డియస్సీ నోటిఫికేషన్ కు ఎంత వరకూ అడ్డువస్తాయి?
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు వరకూ డియస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చాక పరీక్షను నిర్వహించుకోవడానికి ఎన్నికల కోడ్ అడ్డు కాదు. అయితే ఎన్నికలను నిర్వహించాల్సింది అసంఖ్యాకంగా ఉన్న ఉపాధ్యాయ బృందం. ఒకవేళ ఏదైనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినా వారే నిర్వహించాలి కనుక ఈ రెండు ఒకేసారి రాకుండా జాగ్రత్త పడతుంటారు. కనుక ఎన్నికలకు ఒక మూడు నెలల ముందే డియస్సీ పరీక్షలు ఉంటే ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి.
ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగించాలా? వద్దా?
మీరడుగుతున్న ఈ ప్రశ్న నాకు ఇలా వినిపిస్తుంటుంది ‘’నేను డియస్సీ ఉద్యోగం సంపాదించాలా? వద్దా? అన్నట్లు’’ నిజానికి ఎవరైతే పరీక్ష రోజు వరకూ ఎటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం లేకుండా తమ ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారే విజేతలుగా నిలిచి ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరుతారు. వచ్చి పోయే కెరటాలలా, నోటిఫికేషన్ ఉందన్న వార్త కనిపిస్తే వారం చదవడం, లేదన్న వార్త కనిపిస్తే నెల రోజులు చదువు మానడం చేసే వారు కేవలం, పరీక్షల నిర్వహణకై డబ్బు చెల్లించేవారే కానీ పోటీలో ముందుకు నిలబడే వారు కాదని అర్ధం.
మిత్రమా, ఇది నీ జీవితం. పోటీలో ముందుకు సాగేవారు మాత్రమే విజయం సాధిస్తారు. కుందేలులా విశ్రమిద్ధామనుకున్న వారికి మిగిలేది ఓటమే. కనుక ఏమాత్రం ఆలోచించకుండా ప్రిపరేషన్ కొనసాగించండి.
ఆర్దికంగా ఇంతకాలం (ప్రైవేటు) ఉద్యోగం చేయకపోతే ఇబ్బంది. మరి ఎలా వేచిచూడాలి?
ఇది వాస్తవం. దాదాపు డియస్సీకు సిద్దమయ్యే అభ్యర్ధులలో 90 శాతం మంది ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారే. ఇలా ఎక్కువ కాలం ఉద్యోగం మానేసి ఇంటివద్ద ఉండాలంటే కష్టమే. మీ పరిస్థితి కూడా అటువంటిదే అయితే మీకు నాదొక సలహా . . . ఇప్పటి నుంచి సమయం పెట్టుకుని ఒక 60 రోజులు పూర్తి అంకిత భావంతో 61వ రోజు పరీక్ష ఉందన్నంత సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మీ సిలబస్ మొత్తం ఈ 60 రోజులలో మీరు పూర్తి చేసేయగలరు. ఈ 60 రోజులలో డియస్సీ తేదీలపై స్పష్టత వస్తే ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా, పరీక్షా తేదీలపై స్పష్టత రాకపోయినా, మీ ఉద్యోగంలో మీరు చేరిపోండి. అప్పటికే సిలబస్ ను పూర్తిగా చదివి ఉంటారు కనుక రోజులో కనీసం ఆరు గంటల సమయం దొరికితే రివిజన్ చేసుకుంటూ చదివింది మరచిపోకుండా డియస్సీ కోసం ఎదురు చూడవచ్చు.
ఒక్కసారి ఆలోచించండి. చక్కని జీతం, ఇంటి వద్ద ఉంటూనే చేయగల ఉద్యోగం, ఆడుతూ పాడుతూ పిల్లల మధ్య సాగిపోయే జీవితం, కుటుంబాన్ని ఆనందంగా ముందుకు తీసుకుపోగల అవకాశం, పిల్లల భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దగల అవకాశం ఊరికే వస్తాయా మిత్రమా? కొంచెం శ్రమ పడాలి. . . ఆపై మరింత ఓపిక, సహనం కలిగి ఉండాలి.
మీ ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా కొనసాగాలని, మీరు డియస్సీలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ
నవచైతన్య కాంపిటీషన్స్,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్ 9640717460
మీకు మరేదైనా సందేహం ఉన్నట్లయితే క్రింద కామెంట్ లో తెలియచేయండి. సాధ్యమైనంత త్వరగా సమాధానం తెలిపేందుకు ప్రయత్నిస్తాము.