| About us | Contact us | Advertise with us

రిటైర్మెంట్ వయస్సు పెంపు – నిరుద్యోగులకు శాపమా?

రిటైర్మెంట్ వయస్సు పెంపు – నిరుద్యోగులకు శాపమా? రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రకటన           ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ... thumbnail 1 summary

రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం ఫలితంగా ఉద్యోగాల భర్తీపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంటో తెలియచేయడానికి తగిన విశ్లేషణాత్మక కథనం

రిటైర్మెంట్ వయస్సు పెంపు నిరుద్యోగులకు శాపమా?

రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రకటన

          ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించింది. 23.28% ఫిట్మెంట్ తో పాటు అనేక ఆర్ధిక, ఆర్ధికేతర రాయితీలు దీనిలో భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంగానే గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాలు నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నట్లు, ఉద్యోగులు అడగకుండానే ఈ వరం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

రిటైర్మెంట్ వయస్సు పెంపు
          ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే అనేక నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులలో కొత్త అలజడి మొదలైనది. ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపులతో పాటు సోషల్ మీడియాలో నిరుద్యోగులకు ఇది శాపమని, దీని వల్ల రిక్రూట్మెంట్ లు లేకుండా పోతాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందంటూ హడావుడి చేస్తున్నాయి. నవచైతన్య కాంపిటీషన్స్ కూ నిన్నటి నుంచి అనేక మంది మిత్రులు వాట్సాప్ ద్వారా ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. వాళ్లలో గల అపోహలను నివృతి చేయడంతో పాటు, మా విశ్లేషణాత్మక సమాధానం చెప్పడానికే ఈ ప్రయత్నం.

రిటైర్మెంట్ వయస్సు పెంపును గురించి:

          ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, సీనియర్ ఉద్యోగుల యొక్క అనుభవాలను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటుంది. మరీ ముఖ్యంగా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారధిగా నిలిచే ఉద్యోగులలో కూడా సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోషన్స్ ఇవ్వడం తో పాటు అనేక బెనిఫిట్స్ ను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వరమైన రిటైర్మెంట్ వయస్సు పెంపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతంలో 58 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సును అప్పటి చంద్రబాబు నాయుడుగారి ప్రభుత్వం 60 సంవత్సరాలుగా పెంచితే, ప్రస్తుత జగన్మోహనరెడ్డిగారి ప్రభుత్వం దీనిని 62 సంవత్సరాలకు పెంచేలా నిర్ణయాన్ని తీసుకుంది. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ వయస్సు పెంచడం వల్ల ఏమి జరుగుతుంది?

          రిటైర్మెంట్ వయస్సును పెంచడం వల్ల ఉద్యోగులకు చక్కని ఫలితాలే కనిపిస్తాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాలు విధులు చేసే అవకాశం లభించడం వల్ల ఆ రెండు సంవత్సరాలు పూర్తి జీతం తీసుకోవడంతో పాటు ప్రతి ఆరు నెలలకు వచ్చే డీఏలు, ప్రతి సంవత్సరం లభించే వార్షిక ఇంక్రిమెంట్లు వారికి లభిస్తాయి. రిటైర్మెంట్ నాటికి తమ జీతంలో రెండు సంవత్సరాల మందం పెరుగుదల నమోదు కావడం వల్ల వారి పెన్షన్లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. మోస్ట్ సీనియర్స్ కు మాత్రమే ప్రమోషన్ ద్వారా లభించే ఉన్నత స్థాయి ఉద్యోగులకు మరికొంత కాలం ఆయా స్థానాలలో పనిచేయడానికి అవకాశం లభించడంతో పాటు, క్రింది కేడర్ ఉద్యోగులకు కూడా సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది. అనారోగ్యరీత్యా అప్పటికే చాలా సంవత్సరాలపాటు సర్వీస్ చేసి విసిగిపోయి ఉండి రిటైర్ అయిపోతే బావుంటుంది అనిపించే అతి కొద్దిశాతం మంది మినహా ఈ రిటైర్మెంట్ వయస్సు పెంపు పట్ల దాదాపు అందరు ఉద్యోగులూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు.

 

         ఇక ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించినపుడు, ఉద్యోగులను సంతోషపరిచే చక్కని వరం ప్రసాదించడంతో పాటు, ప్రభుత్వం ఆర్ధికంగా కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. సహజంగా రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం ప్రభుత్వ బాధ్యత. ఉద్యోగి స్థాయిని బట్టి ఇవి సుమారు 30 లక్షల నుంచి 80 లక్షలు పైగా ఉండే అవకాశం ఉంటుంది. రిటైర్మంట్ వయస్సును పెంచడం వల్ల ఇక రెండు సంవత్సరాల పాటు రిటైర్ అయ్యే ఉద్యోగులు ఉండరు కనుక ఒకేసారి ఇలా అమౌంట్ ఇవ్వవలసిన పరిస్థితి నుంచి ప్రభుత్వం కొంచెం ఊరట పొందుతుంది. అదే సందర్భంలో ఈ రెండు సంవత్సరాలూ మామూలుగా అయితే రిటైర్ అయిపోవాల్సిన ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి కొత్తగా చేరుతుంది. అదీ కాక అప్పుడే విధులలో చేరిన ఉద్యోగి అందుకునే జీతానికి, అదే కేడర్ లో సీనియర్ ఉద్యోగి అందుకునే జీతానికి చాలా చాలా తేడా ఉంటుంది. మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండే ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మేలు చేస్తుందని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక ఈ రెండింటికీ సిద్ధపడుతూనే ప్రభుత్వాలు రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ ఉంటాయి.

          అయితే గౌరవ హైకోర్టు సూచనలను అనుసరించి రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు మించి పెంచరాదనే సూచనలను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచినపుడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకున్న సందర్భంలోనూ కోర్టు ఒప్పుకోకపోవడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించేసింది. అది కోర్టులో నిలబడుతుందా లేదా అన్నది కోర్టుకు వెళ్లిన తరువాత వచ్చే చర్చ. ఒకవేళ ఆ నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకిస్తే ఇక ఇబ్బంది లేదు. వ్యతిరేకించక అమలు చేస్తే ఏమవుతుంది అనేది కూడా మనం విశ్లేషిద్దాం.

దీనివల్ల ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగవా?

          రెండు సంవత్సరాల పాటు రిటైర్మెంట్లు లేనపుడు ఖచ్చితంగా ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగడం సాధ్యం కాదనే అర్ధం. ఒక ఉద్యోగి రిటైర్ అయినపుడు ఆ ఖాళీని వేకెన్సీల జాబితాలో చూపుతూ తరువాత జరిగే భర్తీ ప్రక్రియల ద్వారా ఆ ఖాళీలలో చేరడానికి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక రెండు సంవత్సరాల పాటు కొత్త ఖాళీలు ఏర్పడే ప్రక్రియ వాయిదా పడినట్లుగానే భావించవచ్చు కనుక ప్రస్తుతం ఉన్న ఖాళీలకు విధులలో ఉండి మరణించే, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఖాళీలు తప్ప రెగ్యులర్ పెరుగుదల జతకాకపోవచ్చు.

నిరుద్యోగులకు ఇది శాపం అవుతుందా?

          ఇక అసలు విషయానికి వస్తే, రిటైర్మెంట్ వయస్సును పెంచడం వల్ల ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య రానున్న రెండు సంవత్సరాలలో పెరిగే అవకాశం లేదన్న వార్త విన్న తరువాత నిరుద్యోగులు అంతా తమకు అన్యాయం జరిగిపోయిందంటూ ఆందోళన చెందుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంచడం అనేది ఖాళీల సంఖ్యపై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నప్పటికీ, నిరుద్యోగులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా మేము మీకు తెలియచేస్తున్నాము.

          ఈ రెండు సంవత్సరాలు ఉద్యోగుల రిటైర్మెంట్స్ లేకపోవడం వల్ల ఖాళీల సంఖ్య అయితే పెరగదు కానీ, ఇప్పటికే పలు శాఖలలో చాలా పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తలచుకుని ప్రస్తుతం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని తలస్తే పెద్ద ఎత్తున ఎపిపియస్సీ నుంచి, గ్రూప్-4 నుంచి గ్రూప్-1 స్థాయి వరకూ ఎక్కువ సంఖ్యలోనే పోస్టులను భర్తీ చేయగల అవకాశం ఉంది. సాధారణంగా ఉన్న ఖాళీలన్నింటినీ ప్రభుత్వాలు ప్రదర్శించకుండా, అవసరం మేరకు, ఆర్ధిక వెసులుబాటు లభించినంత మేరకు భర్తీ చేసుకుంటూ పోతాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న ఖాళీల సంఖ్య చాలా ఎక్కువ అని గుర్తించండి. కనుక చేయాలన్న మనస్సు ఉంటే ప్రభుత్వానికి ఖాళీల భర్తీ పెద్ద పనేమీ కాదు. దీనికి రిటైర్మెంట్ వయస్సు పెంపు ఫలితంగా ఏదో ఇబ్బంది ఎదురు అవుతుంది అనీ, ఇదేదో తమకు శాపమనీ నిరుద్యోగులు భావించాల్సిన అవసరమే లేదు.

ఖాళీల భర్తీ ప్రక్రియలు జరుగుతాయా?

          ఆశావహ దృక్పథంతో ముందుకు సాగడం అనేది ఉద్యోగం సాధించాలన్న తపన ఉండే ఉద్యోగికి ఉండాల్సిన ముఖ్య, ప్రధాన లక్షణం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి నుంచీ నిరుద్యోగులపట్ల ప్రేమగల ప్రభుత్వంగా ప్రకటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గ్రామ సచివాలయాల పేరిట లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసి ఆశ్చర్యపరచింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి, తలక్రిందులైన ఆర్ధిక పరిస్థితుల ఫలితంగా కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమైనప్పటికీ, రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు ప్రస్తుత ప్రభుత్వానికి కీలక సంవత్సరాలు. మరీ ముఖ్యంగా ఎన్నికల సంవత్సరాలు అని వీటిని చెప్పవచ్చు.

          ఈ క్రమంలో ఆలోచించినపుడు కొంచెం ఆలస్య కావచ్చునేమో కానీ తప్పకుండా రాబోయే సంవత్సరాలలో నిరుద్యోగులకు గౌరవప్రదమైన సంఖ్యలో ఖాళీలు ఉండేలా చక్కని నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి. లక్షకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ ఇప్పటికే ప్రకటనలు వినిపిస్తున్నాయి. బహుశా ఆ సంఖ్యలో కాకపోవచ్చు కానీ, రాబోయే సంవత్సరాలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది అని నవచైతన్య కాంపిటీషన్స్ అంచనా వేస్తోంది.

డియస్సీ మాటమేమిటి?

          మిగిలిన ఉద్యోగాలపై పడినట్లుగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై కూడా ఈ రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో పలు సంస్కరణలను తీసుకుని వస్తున్నది. మరీ ముఖ్యంగా పాఠశాలల వ్యవస్థను పునర్వవస్థీకరణ చేయడంతో పాటు 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ చాలా వేగంగా సాగుతున్నది. ఒక కోణంలో గమనించినపుడు ఈ ప్రక్రియ వల్ల పోస్టుల సంఖ్య తగ్గుతుందని కనిపిస్తున్నది. మరొక కోణంలో గమనించినపుడు సబ్జక్టు టీచర్ల కొరత ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనిపిస్తోంది.

          3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్న సందర్భంలో గమనించినపుడు ప్రాధమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు పంపబడుతున్న పిల్లల సంఖ్యకు తగినట్లుగా, ఉపాధ్యాయుల సంఖ్య ఉండటం లేదు. ప్రాధమికంగా పరిశీలించినపుడు ఈ మార్పు వల్ల ఉన్నత పాఠశాలల్లో మూడు నుంచి ఐదు ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటిని ప్రమోషన్ల ద్వారా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఉపాధ్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున ఖాళీల భర్తీ ప్రక్రియ జరిగేందుకు అవకాశం మాత్రం కనిపిస్తోంది.

          ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే బడ్జెట్ లో ఎక్కువశాతం ఖర్చు చేస్తున్నామంటూ, ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఖాళీల భర్తీ ప్రక్రియ అనివార్యం కనుక, రాబోయేవి ఎన్నికల సంవత్సరాలు కనుక ఆశించిన సంఖ్యలోనే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా జరుగుతుంది అని ఆశిద్దాం. ఆశావహ దృక్పథంతో నోటిఫికేషన్ అంటూ వస్తే, ఒక్క ఉద్యోగం ఉన్నా నాకు చాలు అంటూ గట్టి ప్రిపరేషన్ వైపు ఉద్యోగార్ధులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మరి నిరుద్యోగులు చేయాల్సిందేంటి?

          ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, పోస్టుల సంఖ్య వందలలో ఉంటే, అప్లికేషన్లు లక్షలో ఉండటాన్ని మనం గమనిస్తున్నాము. ఒక్కొక్క పోస్టుకు వేలల్లో పోటీ పడుతున్న ఈ సందర్భంలో ఏదో అరాకొరా ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే. సీరియస్ అభ్యర్ధి, ఉద్యోగాలను సాధించాలన్న తపనను కలిగి ఉంటే ఆర్ధికంగా తమ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అయినా మిగిలిన సమయాన్ని ఆయా పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు కేటాయించాల్సి ఉంటుంది. రోజుకు హీనపక్షం మూడు నాలుగు గంటల పాటు ప్రిపరేషన్ కు కేటాయించి, ఆశావహ దృక్పథంతో నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ముందుకు నడవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటే, ఆ ఉద్యోగం కూడా ‘ఇతనికి మరోసారి నోటిఫికేషన్ వచ్చినపుడు ఉద్యోగం ఇద్దాంలే’ అంటూ మిమ్మల్ని గెంటి వేస్తుంది.

          కనుక మిత్రమా, నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులను ప్రక్కన పెట్టండి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, ఎన్ని ఖాళీలు ఉన్నా నాకు ఒక్క ఖాళీ చాలు అని మనస్సులో సమాధానపరచుకోండి. ‘చెప్పడం సులభమే కానీ చేయడమే కష్టం’ అని మీ మనస్సులో మెదిలితే, చెప్పినా, విన్నా – పరిస్థితులను బట్టీ, ప్రభుత్వం ఇచ్చే ఖాళీల సంఖ్యను బట్టీ పోటీ పడటం మినహా మన చేతుల్లో ఏమీ ఉండదని గమనించండి. కనుక ఆశావహ దృక్పథంతో నోటిఫికేషన్ వరకూ ఎవరైతే సహనంగా ప్రిపరేషన్ కొనసాగిస్తారో, వారే విజేతలుగా నిలుస్తారని మరోసారి నవచైతన్య కాంపిటీషన్స్ స్పష్టం చేస్తోంది.

మీ ప్రయత్నం విజయం వైపుకు సాగాలని

ప్రభుత్వ విధానాలు కూడా మిమ్మల్ని ప్రోత్సహించేలా ఉండాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటూ

మీ

నవచైతన్య కాంపిటీషన్స్




exams.navachaitanya.net