| About us | Contact us | Advertise with us

పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే ఏ పుస్తకాలు చదవాలి? | AP and Telangana Police Constable Syllabus analysis - Best Books Suggestions

How to succeed in Police constable exams 2021 Telangana and Andhra Police Department ఆంధ్రా మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రాధమిక పరీక... thumbnail 1 summary

How to succeed in Police constable exams 2021 Telangana and Andhra Police Department

ఆంధ్రా మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షలో విజయం సాధించాలంటే ఏ పుస్తకాలను చదవాలి?


జనరల్ ఇంగ్లీష్:
ఎపి పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ ఒక కీలక విభాగము. ఈ విభాగం నుంచి గత కానిస్టేబుల్ ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే 30 ప్రశ్నల వరకూ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జనరల్ ఇంగ్లీష్ విభాగంలో ప్రధానంగా వొకాబులరీపై అభ్యర్ధికి ఉన్న పట్టు తో పాటుగా గ్రామర్ పై ఉన్న పట్టును గురించిన కూడా పరీక్షించడం జరుగుతున్నది. కనుక అభ్యర్ధులు నిష్ణాతులైన ఆంగ్ల ఉపాధ్యాయులు లేదా మార్గనిర్ధేశకుల సహకారంతో ఆంగ్ల భాషపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా గ్రామర్ లోని ప్రధాన అంశాలైన Parts of speech, Tenses, Direct & Indirect Speech, Active & Passive Voice, Transformation of sentences, Question tags వంటి విభాగాలపై పట్టుకోసం ప్రాధమిక విషయాలను తెలుసుకుని వీలైనంత ఎక్కువ బిట్స్ ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్షనరీ ఆధారంగా Synonyms, Antonyms, Spellings వంటి వొకాబులరీ సంబంధిత ప్రశ్నలలో గరిష్ట మార్కుల సాధనకై ప్రయత్నాలు చేయాలి. జనరల్ ఇంగ్లీష్ కోసం ప్రామాణిక పుస్తకాలు ప్రత్యేకంగా ఈ పోటీ పరీక్షల నిమిత్తం అయితే అందుబాటులో లేనప్పటికీ Wren & Martin English Grammar Book తో పాటు మార్కెట్ లో దొరికే ఇతర పబ్లికేషన్స్ పుస్తకాలలో ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి.

అరిథ్ మెటిక్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్):
అరిథ్ మెటిక్ విషయంలో దాదాపుగా ప్రాధమిక గణిత భావనలపై అభ్యర్ధులకు ఉన్న పట్టును పరిశీలించే ప్రయత్నం జరుగుతున్నది. కనుక మొదట అభ్యర్ధులు 6 నుంచి 10 వరకూ గల గణితం పాఠ్యపుస్తకాలలో అరిథ్ మెటిక్ విభాగానికి పునాదిగా ఉన్న చాప్టర్లను ఎంచుకుని చదవాల్సి ఉంటుంది. ఆ తరువాత మార్కెట్ లో దొరికే S Chand పబ్లికేషన్ వారి Quantitative Aptitude, Yes & Yes, SVR ఇతర ప్రముఖ పబ్లికేషన్స్ యొక్క పుస్తకాలను అందుకుని వాటిని ఆధారంగా మరింత పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. అరిథ్ మెటిక్ విభాగంలో ఆయా ప్రశ్నలకు అభ్యర్ధి సమాధానాలను గుర్తించడంతో పాటు, సాధ్యమైనంత త్వరగా గుర్తించడం (వేగం) పై కూడా విజయం ఆధారపడి ఉంటుంది కనుక ఈ విషయమై వేగంగా సమాధానాలను గుర్తించేందుకు అభ్యర్ధులు కృషి చేయాలి.

రీజనింగ్ ఎబిలిటీ:
రీజనింగ్ విభాగంలో కూడా ప్రాధమిక రీజనింగ్ అంశాలపైనే ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇది అకడమిక్ సంబంధిత అంశాలతో ముడిపడినది కాకపోవడం, కొత్త సబ్జక్టుగా చాలా మంది అభ్యర్ధులు భావించడం మూలంగా ఈ సబ్జక్టు కొద్ది మంది అభ్యర్ధులకు కష్టమైనదిగా తోస్తుంది. అయితే ఇందులోని అనాలజీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్ డీ కోడింగ్, రక్తసంబంధాలు, వయస్సులు వంటి దాదాపు చాలా అంశాలు కొంచెం పట్టు సాధిస్తే చాలు తప్పకుండా మార్కు వస్తుంది అనేలా ఉంటాయి. కనుక అభ్యర్ధులు ఆయా రీజనింగ్ అధ్యాయాలకు సంబంధించి సరళమైన ప్రశ్నలతో ప్రారంభించి కఠినమైన ప్రశ్నల వరకూ పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. ఈ విభాగంపై పట్టు కోసం GMR పబ్లికేషన్స్, SVR పబ్లికేషన్స్, శ్రీ సాయితేజ్ పబ్లికేషన్స్, Yes & Yes పబ్లికేషన్స్ తో పాటు ఇతర ప్రముఖ ప్రచురణ సంస్థల యొక్క పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నవి.

జనరల్ స్టడీస్:
జనరల్ స్టడీస్ లో జనరల్ సైన్స్ విభాగం అత్యంత కీలకమైన మరియు స్కోరింగ్ కు సహకరించే విభాగం. కనుక కానిస్టేబుల్ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు ఈ విభాగంపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయాలజీ విభాగం నుంచి 15 ప్రశ్నల వరకూ అడుగుతన్నట్లుగా గత కానిస్టేబుల్ ప్రశ్నాపత్రాలను గమనిస్తే అవగతమవుతుంది. అలాగే భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 10 నుంచి 15 వరకూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సబ్జక్టులలో గత కానిస్టేబుల్ ప్రశ్నాపత్రాలను గమనిస్తే 6 నుంచి ఇంటర్ వరకూ గల పాఠ్యపుస్తకాల నుంచే మెజారిటీ ప్రశ్నలు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. కనుక అభ్యర్ధులు మొదట 6 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్యపుస్తకాలను సేకరించుకుని చదివే ప్రయత్నం చేయాలి. సమయం ఉంటే ఇంటర్ పుస్తకాలను కూడా ఓసారి తిరగేయాలి. మార్కెట్ లో దొరికే GBK పబ్లికేషన్స్, MC Reddy పబ్లికేషన్స్, SVR పబ్లికేషన్స్, Yes & Yes పబ్లికేషన్స్ పుస్తకాలను నమ్ముకుని చదివే ప్రయత్నం చేసినా తక్కువ సమయంలో సబ్జక్టుపై పట్టు సాధించి కనీసం 60% ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది.

ఇక కానిస్టేబుల్ పరీక్షలో మరొక కీలక విభాగం, జనరల్ స్టడీస్ లోని భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, పాలిటీ, ఎకానమీ మరియు జాగ్రఫీ. సిలబస్ లో భారతదేశ చరిత్ర, భారతదేశ భూగోళ శాస్త్రం అని స్పష్టంగా ఇచ్చినా, గత ప్రశ్నాపత్రాల సరళిని పరిశీలించినపుడు వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రము, ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి కూడా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కనుక అభ్యర్ధులు మొదట 6 నుంచి 10వ తరగతి వరకూ సోషల్ పుస్తకాలు సేకరించుకుని వాటిని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయాలి. ఆపై సమయం ఉండి పూర్తిగా పట్టు సాధించాలనుకుంటే సబ్జక్టుల వారీగా పుస్తకాలను సేకరించుకుని చదవాల్సి ఉంటుంది. అంత సమయం కేటాయించలేని పరిస్థితులలో మార్కెట్ లో దొరికే ఏదైనా కానిస్టేబుల్ జనరల్ స్టడీస్ పుస్తకాన్ని సేకరించుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వార ఈ విభాగంపై అభ్యర్ధులు పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

చివరగా మరొక కీలక సబ్జక్టును గురించిన చర్చతో ఈ విశ్లేషణను ముగిద్దాము. ఆ సబ్జక్టు ఈ కానిస్టేబుల్ పరీక్షకే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు కూడా కీలకం అయిన కరెంట్ అఫైర్స్ సబ్జక్టు. దీనికోసమై అభ్యర్ధులు కనీసం ఆరు నెలల ముందు నుంచి దినపత్రికలను క్షుణ్ణంగా చదవాల్సియుంటుంది. దీనికై నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహిస్తున్న ‘భరద్వాజ్ కరెంట్ కాలమ్’ అనుసరిస్తే సరిపోతుంది. కనీసం రోజూ రెండు దినపత్రికలతో పాటుగా విజేత కాంపిటీషన్స్, ఉద్యోగ సోపానం, షైన్ ఇండియా వంటి పక్ష, మాస పత్రికలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా కేవలం కరెంట్ అఫైర్స్ పైనే కాకుండా వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ద్వారా జనరల్ స్టడీస్ విభాగంపై కూడా పట్టు సాధించే అవకాశం దొరకడంతో పాటు చక్కని ఫలితాన్ని సాధించే అవకాశం ఉన్నది.



exams.navachaitanya.net